My travels is all about... My views, thoughts and experiences on/about/at/with random places of interest, persons, things, events, issues etc,. I am an eternal student with a restless mind and a tumultuous heart!

Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Monday, March 16, 2026

ఓ చింత చెట్టు కథ



(
సంక్రాంతి, జనవరి 2026; గ్వాలియర్, మధ్య ప్రదేశ్)  

జిబ్రాల్టర్ అఫ్ ఇండియా గా పేరుగడించిన, శత్రుదుర్భేద్యమైన,  గ్వాలియర్ కోట సందర్శన పూర్తి అయ్యింది. దగ్గర్లో వున్న తెలీ కా మందిర్, సాస్ బహూ గుళ్ళ దర్శనమూ అయ్యింది. తదుపరి మజిలీ హిందుస్తానీ సంగీత సామ్రాట్ తాన్సేన్  గారి సమాధి. 2023 లో గ్వాలియర్ నగరానికి UNSECO World Heritage City of Music గా గుర్తింపు వచ్చింది. హిందుస్తానీ సంగీత సంప్రదాయం లో గ్వాలియర్ ఘరానా (గురు శిష్య పరంపర) చాలా సుప్రసిద్ధమైనది, పురాతనమైనది. ఈ ఘరానా / గురు శిష్య పరంపర కి ఆద్యుడు రాజ రామ తనూ పాన్డే అలియాస్ తాన్సేన్. గ్వాలియర్ నగరవాసి.



సాస్ బహు గుడి దగ్గర నుంచి ర్యాపిడో  బుక్ చేశాను. క్యాప్టెన్ పేరు దీపక్ యాదవ్ గారు. ఏదో బిజినెస్ మెన్ అని చెప్పారు. సాస్ బహు గుడి దగ్గర నుంచి ర్యాపిడో బైకు మీద తాన్ సేన్ సమాధి వైపు కదిలాను. ర్యాపిడో బైక్ గంభీరమైన గ్వాలియర్ వీడి మాధవరావు సింధియా గారి విగ్రహం దాటి, వన్ టౌన్ ఏరియా, మార్కెట్ మీద గా చేరాల్సిన చోట కి చేరాం. తాన్సేన్ గారి సమాధి పక్కనే మహ్మద్ గౌస్ అనే సుఫీ ప్రవక్త సమాధి వుంది, అది చాలా పెద్దది. సమాధి వైపు వెళ్తూనే మెట్ల మీద వున్న ఒకాయన ఉపోద్ఘాతం అందుకున్నారు, తెలిసి తెలియని విశేషాలు చెప్తూ తాన్సేన్ గురించి. లోగా నా తో పాటు వచ్చిన యాదవ్ గారు సమాధి వైపు వెళ్లి సాష్టాన్గపడ్డారు. అక్కడే ఆవరణ లో కంచె వేసిన చింత చెట్టు ఒకటి కనిపించింది. 

అతి కష్టం మీద యాదవ్ గారు ఇంకొకాయన ఆ చింత చెట్టు దగ్గర చాల సాహాసం తో నాలుగు ఆకులు కోసి, అత్యంత వినమ్రంగా నమిలారు.  నేను కుతూహలం గా చెట్టు గురించి వాకబు చేశాను. అది మంచి మహిమ కలిగిన చింత చెట్టు అని, దానికి చింత కాయలు ఏమీ కాయవని, దాని ఆకులు నమిలితే తాన్సేన్ మాదిరి గాత్ర మాధుర్యం కలుగుతుందని నమ్మకం ట. అది అక్కడి ఆచారం ట. సమాధి కి వచ్చి పోయే సందర్శకులు, ముఖ్యంగా ఏటా జరిగే తాన్సేన్ ఉత్సవం అప్పుడు అరి వీర భయంకరాకారం గా చెట్టు బెరళ్ళు ఊడబీకేవారని, చెట్టు ఇంక ఉంటుందో లేదో అన్న దీనస్థితి కి చేరుకున్న కారణంగా దానికి ఒక కంచే వేసి రక్షించారని తెలియవచ్చింది. భలే ముచ్చట వేసింది.


మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా మన్ననలు పొందిన నవరత్నాల లో ఒకరైన తాన్సేన్ గారు బహుసా ఇక్కడే నడుస్తూ ఏదో ఒక రోజు ఈ చెట్టు ఆకులు నమిలి వుండవచ్చు. జనం అది చూసి మానవ ప్రయత్నం తో సాధించిన excellence ని జీర్ణించుకోలేక సంగీత పాండిత్యాన్ని చింత చెట్టు కి అపాదిన్చారేమో.  లేక, నిజంగా తాన్సేన్ గారి ప్రతి చర్యని గౌరవంగా అనుకరించాలనే ఉత్సాహం ఏమో, అది కాక పొతే నిజంగా చింత చెట్టు ఆకులకి మహత్తు వుందేమో. 

నన్ను కుడా నమలమన్నారు. సరే, ఇంక ఇప్పుడు వచ్చే గాత్ర మాధుర్యం తో నేను తాన్సేన్ లాగా రాగ మల్హర్, రాగ దీపక్ లు పాడినా, పోషించే అక్బర్ పాదుషాలు లేరు గా. దీనం గా చూస్తున్న ఆ చింత చెట్టు వైపు మరీ పుష్పవిలాపం టైపు లో ఫీల్ అవ్వకపోయినా, ఆకులు నమిలే ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాను.  





ఓ చింత చెట్టు కథ  (Telugu Story)

Maheeth Veluvali,
16 Saladi Jamindar Street, Palakollu,.

16th of March, 2026. 


Tuesday, February 17, 2026

మిస్సైన ట్రైన్....మిస్సవ్వని లింగరాజ స్వామి దర్శనం

సాయంత్రం 5.45 అవ్తోంది. పూరి బడా దందా (గ్రాండ్ రోడ్) లో రోడ్డు మీద వున్న చిన్న చిన్న షాపులను చుస్తూ Twills దగ్గర ఆగి రాపిడో బైక్ బుక్ చేసుకున్నా రైల్వే స్టేషన్ వరకు. జగన్నాధ స్వామి దర్శనం బాగా జరిగింది. చాలా కాన్ఫిడెంట్ గా పూరి – తిరుపతి ఎక్ష్ప్రెస్స్ 6.40 కి అని ధీమా గా, ట్రైన్ లో తినడానికి దొరుకుతాయి, కానీ, దగ్గర్లో వున్న ఒక వెజిటేరియన్ హోటల్లో వెజ్ బిర్యాని ప్యాక్ చేయించి, పూరి స్టేషన్ బయట అటూ ఇటూ పచార్లు చేశాను. మంచి క్షేత్రము, పైగా పుట్టిన రాష్ట్రం కదా, వదల బుద్ధి అవ్వట్లేదు. అదిగో అప్పుడే కనిపించింది, రోడ్డు మీద ఒక కొట్టు...

చానా పోడ, రసగుల్లా, రసమల్లై, చానా గజా స్వీట్ల కొట్టు. జనం ఎగబడి కొంటున్నారు. సరే, టైం వుంది కదా అని తీరికగా చుస్తూ, ఒక పావు కేజీ చానా పోడ ప్యాక్ చేయిచాను ట్రైన లో స్వాహా చేద్దాం అని. 6.20 అవ్తోంది. దగ్గర లోనే పూరి స్టేషన్ కన్పిస్తోంది. కాస్త పక్క గా వెళితే ఒక చిన్న ఖిల్లీ బడ్డి కనిపించింది. ఎలాగో వచ్చాం కదా, ఇంకా జస్ట్ 20 నిమషాల్లో ఒక 5 నిమషాల్లో  స్టేషన్ కి వెళ్ళిపోవచ్చని ధీమా గా ఒక వాటర్ బాటిల్, ఒక మీథా పాన్ (ఖిల్లీ) కట్టించా. పక్కన ఎవరో హిందీ లో Where is my Train app చుస్తూ కంగారు పడుతున్నారు. ‘ఆప్ భీ పూరి తిరుపతి పకడ్నా హైన్ క్యా’ అని మాట కలిపాను. నా మాట విని అప్పటి వరకు సైలెంట్ గా వున్న ఖిల్లీ బడ్డి ఆయన చక్కని శ్రీకాకుళం యాస లో ‘ఏటి బాబు? మీరు పూరి టిరుపతి కా? మరేటి, ముందే చెప్పొచ్చుగా, అది ఎప్పుడో ఎల్లిపొంది అనుకుంటా’ అని అన్నారు. కంగారు గా నేను అప్పుడు Where is my Train app ఓపెన్ చేసి చూసా, ట్రైన్ కరెక్ట్ టైం పూరి లో సాయంత్రం 6.30.  నాకు ఖుర్దా రోడ్ జంక్షన్ నుంచి బుక్ అయ్యింది టికెట్, ఈ ట్రైన్ తదుపరి స్టాప్ అయిన ఖుర్దా రోడ్ జంక్షన్ నుంచి 7.40 కి బయల్దేరుతుంది. పూరి నుంచి ఖుర్దా కి unreserved ticket తీసుకున్నా, 7.40 అనే టైం మాత్రమే రిజిస్టర్ అయ్యింది బుర్రకి, ఆ దెబ్బ తో పూరి లో 6.40 కి బయల్దేరుతుంది అనుకున్నా, అవివేకంగా!

అదిగో అప్పుడే కనిపించింది, రోడ్డు మీద ఒక కొట్టు...
 

చేసేదేమీ లేక, గబా గబా ప్లాట్ఫారం మీదకి పరిగెట్టా, పూరి తిరుపతి ఊసే లేదు. సమయం 6.41. చావు కబురు చల్లగా అన్నట్టు 6.39 కి బయల్దేరింది ట పూరి నుంచి ఆ ట్రైన్. ప్రయాణాలలో ఎప్పుడూ జాగ్రత్త గా వుండే నాకు ఒక ఎదురుదెబ్బ. ఇంత లాంగ్ ట్రైన్ ఎప్పుడూ మిస్ చెయ్యలేదు. తర్వాత రోజు ఉదయమే వెళ్ళాలి ఆఫీసు కి. ఎక్కువ శెలవులు పెట్టలేను కొన్ని పరిస్థితుల దృష్ట్య. స్టేషన్ బయటకి వచ్చి చూసా. రోడ్ మీద వెళితే ఖుర్దా 59 కి.మీ లు. సుమారు 50 నిమిషాలలో వెళ్ళాలి ఇదే ట్రైన్ క్యాచ్ చెయ్యాలి అంటే. పూరి నుంచి నెక్స్ట్ ట్రైన్ వెంటనే లేదు. ఆటో వాళ్ళ తో మాట్లాడి చూశా, ఏమి అర్ధం అవ్వలేదు. 

అప్పుడే స్టేషన్ బయట ఒక కారు బుక్ చేస్కున్న మధ్య వయస్సు దంపతులు భద్రక్ వెళ్ళడానికి సిద్ధంగా వున్నారు, ఆ బండి అతనికి నా పరిస్థితి వివరించి, ఖుర్దా లో దిగబెట్టమన్నాను. అది దారి కాదు, కాస్త deviate అవ్వాలి వారి రూట్ కి. గట్టిగానే అడిగారు, బేరం కుదిరింది. మార్గ మధ్యలో టెన్షన్ పడుతూనే వున్నాను, ఖుర్దా లో ట్రైన్ అందుతుందా లేదా అని. ఇంట్లో మమ్మీ, డాడి కి, విజయవాడ లో మా శ్రీమతి కి ఫోన్ చేసి చెప్పాను పరిస్థితి, కంగారు పడొద్దని, ఎలాగోలా ట్రైన్ క్యాచ్ చేస్తానని, అది మిస్ అయతే, తర్వాత ట్రైన్ కి అయినా వచ్చేస్తానని. Traffic భయంకరంగా వుంది. దానికి తోడు, భద్రక్ వారు పూరి శివార్లలో కాసేపు కారాపి, కాజాలు కొన్నారు. అప్పుడే నాకు జ్ఞానోదయమయింది. ఖుర్దా లో ఈ ట్రైన్ మిస్ అవతానని అర్ధమయ్యింది. ప్రతీ సారి పూరి జగన్నాథుని దర్శిన్చుకున్నప్పుడు భువనేశ్వర్ లింగరాజ స్వామిని కుడా దర్శించుకోవడం అలవాటు. ఈ సారి కుదరలేదు, ప్లాన్ చెయ్యలేదు, అది ఒక వెలితి లా అనిపించింది. సర్లే, ఎలాగో ట్రైన్ మిస్ అవ్తాను, ఇంక బాధ ఎందుకు, ఒక సారి దర్శించుకుందాం అని నిర్ణయించుకున్నాను. పర్సు తేలికపడబోతోంది. మనస్సు కూడా తేలికపడింది.

లింగారాజ శివాలయం సింహద్వారం వద్ద 
నా ఈ కొత్త ఆలోచన ని వెంటనే ఫోన్ లో ఇంట్లో వాళ్ళకి, శ్రీమతి కి చెప్పి, కారాయనకి చెప్పి, ఎలాగో వారికి దారే కాబట్టి భువనేశ్వర్ లో దిమ్పెయ్యమన్నాను. ఖుర్దా స్టేషన్ దాటేసరికి రాత్రి 8.20 అయ్యింది. నేను క్యాచ్ చేయదలచిన పూరి తిరుపతి 7.56 కి ఖుర్దా నుండి ఆంధ్ర వైపు పరుగులు పెడుతూ వెళ్ళిపోయింది. కాసేపు కారాయన తో భద్రక్ గురించి, అక్కడే వున్న భిత్రకనిక జాతీయ పార్క్ గురించి మాట్లాడాను, మొసళ్ళకు బాగా ఫేమస్. Anaconda సినేమ అక్కడే తీసారన్నట్టు వుంటుంది ట.  ఓ కంట రాజమహేంద్రవరం వైపు వెళ్ళే ట్రైన్లను ఆన్లైన్ లో గమనిస్తూనే వున్నాను. విచిత్రమేమిటంటే, ఆ లైన్లో పూరి తిరుపతి తప్ప అన్ని లేట్ లో నే నడుస్తున్నాయి. 

భువనేశ్వర్ భారుండా సెంటర్ లో ఆగేసరికి రాత్రి 9.00 దాటింది. ఒక ఆటో ని మాట్లాడుకుని లింగరాజ మందిరం వైపు పరుగులు పెట్టాం. గుడి తెరిచి వుంటుందో లేదో తెలీదు ఆ సమయంలో. రెండు చోట్ల రోడ్ బ్లాకు! చిరాకు వస్తోంది. చివరకి గుడి దగ్గరకి వచ్చేసరికి 9.35 కావొస్తోంది. పక్కనే ఆటో పార్క్ చేసి, ఆటో ఆయన పరుగు పరుగున సింహ ద్వారం వైపు వెళ్లారు, నా కోసం గుడి తెరిచి వుందో లేదో చూడడానికి. ఆశ్చర్యం గా తెరిచి వుంది. లగేజి ఆటో లో వుంచేసి, మొబైల్ / చెప్పుల కౌంటర్ మూసేసిన కారణంగా, అక్కడ డ్యూటీ లో వున్న పోలీసులను రిక్వెస్ట్ చేసి, వారి వద్ద మొబైల్ పెట్టి, పరుగు పరుగున లోపలకి వెళ్లాను.

లింగరాజ మందిరం (Lateral View)
గుడి లో ఎవ్వరు లేరు, ఆ రోజుకు ఆఖరి భక్తుణ్ణి నేనే! 8-9వ శతాబ్దాల లో సోమవంశ గజపతులు కట్టించిన లింగరాజ మందిరం భువనేశ్వర్ లోకెల్లా అత్యంత పెద్దదైన, ప్రతిష్టాత్మకమైన శివాలయం. హరి హరక్షేత్రం, గుప్త కాశి, పార్వతీ దేవి మూలంగా ఇక్కడే కీర్తి-వాసర రాక్షస సంహారం జరిగినది అని, ఏకామ్ర క్షేత్రమని అని ప్రతీతి. భోళా శంకరుడు భళా అని మెచ్చినట్టు గా ప్రసన్నంగా చాల చక్కగా దర్శనం అయ్యింది. లింగరాజ దర్శనం అవ్వకుండా వెనుతిరిగాననే వెలితి పటాపంచాలయ్యింది. కళ్ళు చమర్చాయి. Deula / విమాన శిఖరం చుస్తూ ‘నమస్తే అస్తు భగవన్...’ అని స్మరించుకున్నాను.

తిరిగి ఆటో ఎక్కి, భువనేశ్వర్ స్టేషన్ చేరేసరికి 10.00 అవ్తోంది. 10.11 కల్లా సంత్రగాచ్చి – తిరుపతి సుపర్ఫాస్ట్ వచ్చింది. ఈ లోపు ఆన్లైన్ లో టికెట్ తీసేసా, ఎదురుకుండా ఆగిన బోగి లో ఎక్కేసా. ఒక సైడ్ లోయర్ లో సెటిల్ అయ్యి, టి.టి. గారి కోసం వెయిట్ మొదలెట్టాను. ఈ లోగా, ఆకలి గుర్తుకి వచ్చింది. సంచి లో కాస్త ముద్ద అయిన చానా పోడ సేవించాను.

పూరి శ్రీ క్షేత్రం / జగన్నాథ మందిరం వద్ద 
మొత్తానికి ఒక చిరు సాహాసం. అన్ని సందర్భాలలో అన్ని అనుకునట్టు ప్రణాళిక ప్రకారం జరగవు. పంచతంత్రం ముడు చేపల కథ లో లాగా సందర్భానుసారం సమయస్పూర్తి గా అల్లుకుపోవాలి అని మాట. మిస్సైన ట్రైన్ కంగారు పెట్టినా, మిస్సవ్వని లింగరాజ స్వామి దర్శనం హాయి కలిగించింది.

కొసమెరుపు – నేను మిస్సైన పూరి తిరుపతి తర్వాతి రోజు రాజమహేంద్రవరానికి ఉదయం 9.15 కి చేరింది. నేను తర్వాత ఎక్కిన  సంత్రగాచ్చి – తిరుపతి సుపర్ఫాస్ట్ దానికన్నా తొందరగా 8.52 కే దిమ్పేసింది నన్ను రాజమహేంద్రవరం లో....             

 

మిస్సైన ట్రైన్....మిస్సవ్వని లింగరాజ దర్శనం (Telugu Story)

Maheeth Veluvali,
16 Saladi Jamindar Street, Palakollu,.
17th of February, 2026. 

 

 

Thursday, September 25, 2025

మిగ్ స్వగతం

 

బెంగళూరు HAL మ్యూజియం లో మిగ్-21 యుద్ధ విమాన రెప్లికా మోడల్ తో నేను (2016)

(26 సెప్టెంబర్ 2025 న సుమారు అరవై రెండు వసంతాల తర్వాత భారత వాయుసేన, దేశానికి ఎనలేని సేవలందించిన మీకోయాన్-గురివిచ్  మిగ్-21 యుద్ధ విమానానికి సగౌరవంగా వీడ్కోలు పలకనున్న సందర్భాన్ని పురస్కరించుకుని.....  

మిగ్ స్వగతం i.e, మిగ్-21 యుద్ధ విమాన మాటల్లో........ )

 
విశ్రాంతి కై శాశ్వత విరామాన్ని అనుభవించబోయే సమయం లో, మోగే చప్పట్ల మోత కన్నా, వెకిలి నవ్వులే పెద్దగా వినిపిస్తున్నాయేమిటి ? నాలుగు హాలీవుడ్ సినిమాలు చూసేసి, నాలుగు రోజులు కరెంటు అఫైర్స్ చదివేసి, F-16 తో పోల్చి నన్ను తక్కువ చేస్తూ చిన్నబుచ్చుకునే వారికి నేను చెప్పే సమాధానం - తిక్కన గారి భారతం లో రారాజుని చూసి అర్జునుడన్నట్లు "ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలదె." 

ఎక్కడో రష్యాలో పుట్టిన తుప్పట్టిన విమానాన్ని (యంత్రాన్ని), నేను తెలుగు తిక్కన గారి పద్యం చెప్పడం ఏమిటి ? అంతా A.I. మహిమే.   

ఇంకా మొదలయ్యి, అవ్వని ప్రచ్ఛన్న యుద్ధం సాక్షిగా, వెండి వెన్నెల ముద్దల లాంటి యూరాల్ పర్వత శ్రేణుల నడుమ, 1950 ల లో ఒక ప్రేమికుల దినోత్సవం నాడు నేను ఉద్భవించాను. 1962 లో ఒక నమ్మకం పటాపంచలయ్యింది భారతావనికి. అగ్రరాజ్యాల అలజడులు మధ్య, పొరుగింటి పోట్లాటల తో దేశ ఉనికికే ఎసరు అయిన రోజులు, అదిగో అప్పుడే సరిగ్గా 1963 లో మొట్టమొదటి సారిగా, నా మెట్టినింట అడుగుపెట్టాను. విచిత్రమేమిటంటే, ఇదే సోవియెట్ రష్యా మొట్టమొదటి సారిగా ఒక పొరుగు దేశానికి మిగ్ విమానాన్ని, తదనుగుణ సాంకేతికతను బదిలీ చేయడం. 

ఉత్తర ధృవానికి బాగా వంటబట్టే యాంత్రికతని కలిగిన నాకు, ఇక్కడికి వచ్చాక, ఇక్కడి పరిస్థితులకు ఇమిడే మార్పులు చేశారు.  చండీగఢ్ చేరి, సేద తీరేలోపు, మొదటి పుష్కరమే ఎన్నో పరీక్షలు. అన్నింటా జయకేతమే! 1965, 1971 లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కలకత్తా గగన వీధుల నుండి, కార్గిల్ పర్వత శ్రేణి వరకు, నాది ఒక 'అభినందనీయ' పయనమే. అయిదు పుష్కరాల పాటు దక్షిణ ఆసియా లో తిరులేని యుద్ధ విమానం, ఒక సింహస్వప్నం!  నాకు షష్టి పూర్తి అయ్యేసరికి, ఒక 870 మిగ్-21 లను వాయుసేన ఉపయోగించింది,   అందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వారు సుమారు 600 మిగ్-21 లను తయారు చేశారు . 

కానీ, కాలం మారింది. పుట్టినిల్లు విచ్చిన్నమయ్యింది, గోర్బచెవ్ గారి ప్రయత్నం విఫలం అయ్యింది. 'ఎగిరే శవపేటికలు' అని మెట్టినిల్లు మొట్టికాయలు వేసింది. 'విమానాన్ని (యంత్రాన్ని) కదా, నాకు ఏమి హావభావాలు లేవు. అందరు కొత్త ని కోరుకుంటున్నారు. కానీ 'వేయిపడగలు' లో విశ్వనాథ సత్యనారాయణ గారన్నట్టు, "నూత్నత్వము నూత్నత్వమే కానీ శక్తి ఎలా అవుతుంది?" 

అయిదు పుష్కరాల లో ఎంతో జరిగింది. ఇప్పుడు 'తేజస్' లాంటి దేశీయ వారసులొచ్చారు. వివిధ సాంకేతిక సమస్యల వల్ల అమరులైన ఎంతో మంది ధీరులను తలుచుకుని మనస్సు చివుక్కుమంది. 'ఎగిరే శవపేటిక' అనే అపవాదు ఇంక ఎప్పటికి పోదు ఏమో నాకు. అయినా, విమానాన్ని (యంత్రాన్ని) కదా, నాకేమి ఉంటాయి లే హావభావాలు. 

సమయమాసన్నమయ్యింది. అదిగో, భాస్కరుడు ఉదయించబోతున్నాడు. ఇదే ఇక చివరి వీడ్కోలు. చరిత్ర పుటల్ని తిరిగి ఏదో ఒక రోజు తీరిగ్గా తిరగేసినప్పుడు, కాస్త నా గురించి కొంతైన మంచి గా తలుచుకోండి. జై హింద్.     

         

బెంగళూరు HAL మ్యూజియం లో మిగ్-21 యుద్ధ విమాన రెప్లికా మోడల్ తో నేను (2016)



మిగ్ స్వగతం 

Maheeth Veluvali,
16 Saladi Jamindar Street, Palakollu,.
25th of September, 2025. 

Saturday, May 31, 2025

కొండపల్లి

(కొండపల్లి కోట, నవంబర్ 2023) 

 

కోట వద్ద నేను

కృష్ణానదికి ఉత్తరాన, విజయవాడ నగరానికి పశ్చిమంగా కొండపల్లి అనే గ్రామముంది. ఇక్కడికి దగ్గర లోనే    తూర్పు కనుమలు, కళింగ ఖరవేలుడు 'కన్నబెన్న' నదిగా అభివర్ణించిన కృష్ణానదిని  తొలిసారి  ముద్దాడాయి, మరియు గోదావరి-కృష్ణా డెల్టా ప్రాంతం ముగిసింది. ఈ గ్రామం పొనికిచెట్టు కలప నుంచి తయారు చేసిన కొండపల్లి బొమ్మలకు, గ్రామపేరు తోనే వున్న కొండపల్లి కోట / ఖిల్లా కు సుప్రసిద్ధి. కొండవీడు కోట తో సమానమైన ప్రశస్తి కలిగిన ఈ కోట తెలుగు వారి మధ్యయుగ చరిత్ర తెలుసుకోవడానికి ఉపయుక్తం. 

శిథిలాలు 

ఈ కోట కాకతీయులపతన కాలానికే  (1323 CE) వున్నది అన్నది నిర్వివాదాంశం. ఆ కాలం లోనే ఈ కోట  ఓం ప్రధమంగా ముదిగొండ చాళుక్యులు, ముసునూరి నాయకులు వంటి  సామంత రాజ్యాలు, చిన్న చిన్న స్వాతంత్ర్య రాజ్యాల స్వాధీనంలో వుండేది అని శాసన సాక్ష్యం. 14 వ శతాబ్దంలో ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్య స్థాపన తో ఆంధ్రదేశం లో ఒక నూతన సూర్యోదయం మొదలయ్యింది. ఇదే కాలం లో ఆంధ్ర దేశ మధ్యభాగాముగా, కొండపల్లి వాసికెక్కింది. అటు తర్వాత కళింగ సూర్యవంశ గజపతులు, గోల్కొండ కుతూబ్షాహీలు, మొగలాయిలు, హైదరాబాద్ నైజాం సంస్థానానికి చెందిన అసాఫ్ ఝాఈలు వరసగా కొండపల్లి ని ఏలారు. చివరకు బ్రిటీష్ వారి హయాంలో కొండపల్లి సైనిక అవసరాలకు స్థావారంగా (Garrison) గా మారింది.                                               

కుతూబ్షహీల శాసనం 

'ఖగపతుల్, నరపతుల్, గజపతుల్ సాగించిరి సమరము' అని ఒక మధ్యయుగ కవి తెలిపినట్టుగా,  పదిహేనవ శతాబ్దం లో బహమనీలు, గజపతులు, విజయనగర సమ్రజ్యాధీశుల మధ్య మొదలైన త్రైపాక్షిక రణం లో కొండపల్లి ని వశపరుచుకోవడం కీలకమైంది. మొదటగా, సూర్యవంశ గజపతి కపిలేంద్ర దేవుని కొడుకైన హాంవీరదేవ రౌత్రాయా కొండపల్లి ని జయించాడు. సుమారు అర్ధ శతాబ్దం తర్వాత, తన కళింగ జైత్రయాత్ర లో శ్రీ కృష్ణదేవరాయలు, కొండపల్లి కోట ని ముట్టడించాడు. గజపతుల కళింగ రాజ్యానికి కొండపల్లి సుమారు నూరు ఏళ్ళ పాటు దక్షిన సరిహద్దు అయ్యింది.  

కోట ద్వారం

నేడు శిథిలమైన కొండపల్లి కోట అత్యంత సుందరమైన ప్రకృతి వడి లో, పచ్చని చెట్ల మధ్య, పూర్వ వైభవం కొదవైనా విరాజిల్లుతోంది. కోట ని రెందు విధాలు గా చేరుకోవొచ్చు - మొదటగా కొండపల్లి గ్రామము ప్రధాన వీధి (కొండపల్లి బొమ్మల చేతిపనివారి ప్రధాన వీధి) నుంచి కొండ వెనకవైపు గా కాలిబాటన ఒక దారి, రెండవది, ఇబ్రహీంపట్నం నుండి రోడ్డు మర్గాం ద్వారా. శిథిలమైన బురూజు దర్వాజాలు రెండు, గదుల తో వున్న తనీషా రాజభవనం, చెరసాల, అత్యంత గంభీరంగా, గత వైభవాన్ని చాటుతూ స్వాగతిస్తాయి. రాష్త్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కొండపల్లి కి విశేష జనాదరణ కల్పించాలి అని కృషి చేస్తొంది. ప్రభుత్వ నూతన పర్యాటక విధానం ఈ దిశగా ఒక మంచి అడుగు.

   

కొండపల్లి బొమ్మ 

 

కొండపల్లి 

మహీత్ వెలువలి,
16 సలాది జమీందార్ వీధి , పాలకొల్లు ,.
31 మే , 2025.

     

Sunday, August 22, 2021

ఆంధ్రకేసరి

 (ది.23/08/2021 సోమవారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి ని పురస్కరించుకుని)

రక్త మాంసాలు కల్గిన ఒక మనిషి ఇంత ఆదర్శం గా జీవించారు అని ముందు తరాల వారు నమ్మకపోవొచ్చు అని గాంధీ మహాత్ముని గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక గొప్ప మాట చెప్పారు.  Scrupulous honesty, unflinching integrity, courage కి నిలువెత్తు నిదర్శనం ఆయన 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు గారిని తల్చుకుంటే పై మాటే గుర్తుకి వస్తుంది. నేటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం (23 August 1872) లో కటిక దరిద్రం లో జన్మించి, లాయర్ గా కొన్ని తరాల పాటు తరగని ఆస్తి ని సంపాదించి, సహాయ నిరాకరణోద్యమం తో స్వాతంత్ర్య సమరరంగం లో దూకి, చివరకి ఆస్తులన్నీ దేశం కోసం ధారపోసి ప్రాణత్యాగం చేసిన ప్రకాశం గారి జీవితం ఎంతో ఆదర్శం. 

రాజమహేంద్రి పురపాలక సంఘ అధ్యక్షుని గా ప్రారంభమైన వారి రాజకీయ జీవితం, ఎన్నో పదవులకు వారు వన్నె తెచ్చే విధంగా దిగ్విజయంగా సాగింది. ఎనాడూ పదవుల వెంట పడకపోయినా, ముక్కుసూటితనం తో, మోండిధైర్యం తో, నిజాయితీ తో వారు ఏ పదవి లోనూ ఎక్కువసేపు కొనసాగలేకపొయారు. స్వాతంత్ర్య సమరంలో వారిది ప్రత్యేక పాత్ర. సహాయ నిరాకరణోద్యమం తో మొదలై, సైమన్ గో బ్యాక్ ఉద్యమం లో భాగంగా మద్రాస్ లో వేరే నాయకులు భయపడుతున్నప్పుడు, బ్రిటిష్ తుపాకి కి ఎదురుగా రొమ్ము చూపి 'అంధ్రకేసరి ' అనిపించుకుని, ఉప్పు సత్యాగ్రహం సమయం లో మరీనా బీచ్ సత్యాగ్రహన్ని ముందుండి నడిపించడం - ఇవన్నీ చిరస్మరణీయం. 1937 లో మద్రాస్ రాష్ట్రానికి రెవెన్యూ మంత్రి గా, భూసంస్కరణలకై వారు చెసిన ప్రయత్నం విఫలమైనా, ముందు తరాలకు ఒక Blueprint లా అయింది. 1945 లో మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా Firka Development Scheme ని ప్రవేశపెట్టారు.    

నాటి కాంగ్రెస్స్ పార్టీ లో అంతర్గత కలహాల వల్ల కొంతకాలం ఆ పార్టీ కి దూరం గా వున్నారు. కాని అందరూ గౌరవించేవారు వారిని. రాబోయే political crisis ని దృష్టి లో వుంచుకుని, చాలా మంది తర్వాత తరం నాయకులని (Neelam Sanjeeva Reddy, Bejawada Gopala Reddy, etc,.) వారు స్వయంగా ప్రోత్సాహించి, leadership vacuum లేకొండా చేసిన దార్శనికులు. పండీట్ నెహ్రూ గారు 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, పార్టీ లో లేకపొయినా ప్రకాశం గారినే మొదటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గా వుండడం శ్రేయస్కరమని భావించి, కబురంపించరనడం అతిశయోక్తి కాదు. 

చివరి రోజులలో పడ్డ ఆర్ఢిక కష్టాలని లెక్కచెయ్యక, తుదిశ్వాస వరకూ ప్రజాసేవకే అంకితమైన ఆంధ్రకేసరి ని స్మరించుకోవడం ఒక భారతీయుడి గా, ఒక తెలుగు వాడిగా చాలా గర్వంగా అనిపిస్తుంది. 

 

 ఆంధ్రకేసరి (Telugu)
Tribute to Sri Tanguturi Prakasam Pantulu Garu (c.1872 - 1957 CE) - politician, political statesman, freedom fighter, lawyer and the first Chief Minister of Andhra State, famed for his scrupulous honesty, unflinching integrity and courage. He was fondly known as Andhra Kesari i.e, Lion of Andhra. 23rd August 2021 marks his 150eth Birth Anniversary.
 
 
Maheeth Veluvali, 
Sunday - 22nd of August, 2021,
16 Saladi Jamindar Street, Palakollu,.

Monday, June 28, 2021

అంతర్మథనం

(Tribute to PV Narasimha Rao on his birth centenary)

డిసెంబర్ 2004
ఇంక నా జీవితం ముగుస్తోంది. వచ్చిపోయే వారిని గుర్తుపట్టడం కష్టం గా వుంది. పెరిగిపోయిన కోర్టు కేసుల్ని ఎదుర్కోవడానికి అప్పోయింట్ చేసిన మా ప్లీడర్ గారు ధరించిన నల్లని కోటు లో నలుపు మాదిరి ఒక కారు చీకటి ఎప్పుడూ కమ్మేస్తోంది నా ఆలోచనల్ని. కేసులు అంటే గుర్తుకి వచ్చింది. ఇంకా ఎన్ని కేసులు మిగిలాయి? అవి నేను గెల్చానా? ఓడిపోయానా? గుర్తుకి రావట్లేదు.  ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి. అసలు ఏది ఆరంభం? ఏది అంతం!
ఎక్కడ మొదలైంది ఈ ప్రయాణం? ఎన్ని మజిలీలు? త్రిపురీ సభ లో పండిట్ నెహ్రు గారి ప్రసంగం విని నైజం ప్రభుత్వం పై కదం తొక్కింది నేనే నా? అది త్రిపురీ సభా? హరిపూరీ సభా? గుర్తుకి రావట్లేదు. హై కమాండ్ ఉద్దేశాన్ని పూర్తిగా తెలుసుకోలేక, భూ సంస్కరణలు ప్రవేశపెట్టి, పదవి కోల్పోతే, ఆహా, ఒక ముళ్ళ కిరీటం తల మీంచి తీసినట్టు అయింది. అది 1971 ఆ ? 1973 ఆ ? గుర్తు లేదు....

భాషలు నేర్చుకునేకొద్దీ మౌనం లో వున్న మాధుర్యాన్ని, నియంతృత్వ పోకడలు కల్గిన నాయకుల తో మెలిగిన కొద్దీ consensus decision making లో వుండే అందాన్ని, inevitability ని సుకుమారంగా గ్రహించాను. నూతనోత్తేజం నిండింది 80 వ దశకపు భారతావని లో, నా సన్యాసానికి ఇంకా మార్గం సుగమమైంది. కానీ విధి విచిత్రం. నవ్వినా నాప చేనే పండింది. ఏమి తెలుసు నాకు ఆర్ధిక  వ్యవస్థ గురించి - ఆర్ధిక శాస్త్రాన్ని ఎప్పుడూ లెక్కకట్టలేదు. లెక్కకట్టాల్సిన అవసరం వచ్చింది. పది మంది సభ్యుల మద్దతు లేక ఎప్పుడు పడిపోతుందో తెలీని నా హయం లో సంస్కరణలు అసలు ఎలా జరిగాయి? అది ఒక అబ్భుతమా? అందున, నా పాత్ర నామమాత్రమేనా? రాజ్యంగ నిర్మాత డా.అంబెడ్కర్ గారు అభివర్ణించినట్టు, మన దేశం నిజం గా ఒక Indestructible Union యేనేమో.  తూర్పు వైపు చూడమని, అగ్రరాజ్యాల వాంఛలకు తలొగ్గకుండా, పొరిగింటి వారికి పాఠాలు చెప్తున్నప్పుడు ఎంతో హాయిగా అనిపించింది. ఢిల్లీ రాజా వీధుల లో పంజాబ్ కార్యకర్తలు 'పీవీ నరసింహ రావు కి జై' అని జై జైలు పలుకుతువుంటే, వేరెవరైనా పులకరించిపోయేవారే - కానీ అట్టి పొగడ్తలు, భౌతిక శుఖాలు నా లో అంతర్మథనాన్ని ఆపలేకపోయాయి.

అది 1996 ఆ ? 1998 ఆ ? గుర్తు లేదు - టికెట్టు కేటాయించలేదు నాకు. రోజులు మారాయి. మనుషులు వస్తారు, పోతారు,వ్యవస్థే శాశ్వతం! నమ్మిన వారు నట్టేట ముంచారు. ఇంకెంతకాలమో జీవితమనే ఈ వ్యధ . నా పాత్ర ముగిసింది. కానీ నా లో ఇంకా ఆ అంతర్మథనం ఆగలేదు!

అంతర్మథనం - Tribute to PV Narasimha Rao on his birth centenary (Telugu)


Maheeth Veluvali, 
Monday, 28th of June, 2021
16 Saladi Jamindar Street, Palakollu.

Thursday, February 18, 2021

కాంచీపుర దర్శనం-2

(Continued...)
Note - As per Hindu Mythology

రెండవ రోజు (14/02/2021)
కాంచీపురన్న వెలసిన శైవక్షేత్రాలన్నిటి లోకి సుప్రసిద్ధమైనట్టి ఏకాంబరనాధుని దర్శన తో నా  రెండో రోజు మొదలైంది. కామాక్షీ దేవి శివుని గూర్చి ఇచ్చటనే ఒక మామిడి చెట్టు కింద తపస్సు ఆచరించారని నమ్మకం. దేవాలయ ప్రాంగణం లో వున్న ఒక మామిడి చెట్టు అదే చెట్టుఅని నమ్మకం. శైవ పంచ భూత స్థలాల లో ఈ గుడి భూ స్థలమని ప్రతీతి. ఎత్తైన స్థంబాల తో విశాలంగా వున్న ప్రదక్షిణాపథం ఇక్కడ చాలా ముచ్చట గొల్పుతుంది. దేవాలయము లో కారికల చోళుని విగ్రహం వుంది. 

Me at Vaikuntha Perumal Temple


శివదర్శనం తర్వాత దగ్గర లోనే వున్నా వైకుంఠ పెరుమాళ్ దేవాలయాన్ని సందర్శించాను. ఇది చారిత్రక కట్టడం. పల్లవ రాజైన రెండవ నందివర్మ కట్టించిన ఈ గుడి యొక్క వాస్తుకళ విశిష్టమైనది. గుడి ప్రదక్షిణాపథం పక్కన గోడల పై పల్లవుల వంశ  స్థాపన, పరిపాలన, యుద్ధాలు - జైత్రయాత్రలు చాలా చూడముచ్చటగా చెక్కబడ్డాయి. పల్లవ గుళ్ల లో వున్న విశేషమైనట్టి సింహ స్థంబాలు ఇక్కడ విరివిగా కలవు. నల్లటి, ఎత్తైన స్వామి వారి విరాట్ స్వరూపాన్ని కాంచి చాలా సంతోషమేసింది.

 

Pradakshina Patha at Ekambranathar Temple
The Legend of Kanchi


అటుపైన, నగర ప్రధాన కూడలి కి దూరంగా వున్న కైలాసనాథుని దేవాలయం దర్శించాను. ఇది కూడా ఒక విశిష్టమైన చారిత్రక కట్టడం. పల్లవ నిర్మాణ కౌశలానికి మచ్చతునక! శివాలయమైన ఈ గుడి లో 58 చిన్నపాటి shrines కలవు - ఒక్కక్క shrine పై చిన్నపాటి niche carving చెక్కబడ్డాయి. ప్రధాన మండపం లో గర్భాలయం చుట్టూరా ప్రదక్షిణ చేయడం సాహసమే! చిన్న గుహ ద్వారా పాకల్స వస్తుంది. అదో అద్భుతమైన విషయం! ఇకపోతే విమానం బయట వున్నా శిల్ప కళ అత్యద్భుతం! గంగాధరుడైన శివుని Niche carving చాలా ప్రత్యేకమైన అంశం. చిట్టచివరగా, దగ్గర లోనే వున్న పాండవ  పెరుమాళ్ గుడిని దర్శించాను - పాండవ దూత గా శ్రీకృష్ణుని, రుక్మిణీ దేవిని ఇక్కడ ఆరాధిస్తారు. ఇంతటి తో నా కంచి యాత్ర ముగిసింది. మళ్ళీ అదే రోజు చెంగల్పట్టు చేరి సాయంత్రం సర్కార్ ఎక్ష్ప్రెస్స్ లో వెనక్కి బయల్దేరాను.

 

Kailasanathar Temple - Lateral View
Gangadhara Shiva - Kailasanathar Temple


నేను దర్శించిన దేవాలయాలు
1. చిత్రగుప్త స్వామి
2. కార్చపీశ్వరస్వామి
3. వరదరాజ పెరుమాళ్
4. కంచి కామాక్షి అమ్మన్
5. ఉలగానంద పెరుమాళ్
6. ఏకాంబరేశ్వ స్వామి
7. వైకుంఠ పెరుమాళ్
8. కైలాసనాథ స్వామి
9. పాండవ దూత పెరుమాళ్ స్వామి        


వెలువలి మహీత్
కాంచీపుర దర్శనం-2 (13 & 14వ తేదీలు, ఫిబ్రవరి 2021)
19/02/2021, - పాలకొల్లు.

కాంచీపుర దర్శనం-1

(Note - As per Hindu Mythology) 

సుమారు సంవత్సరం తర్వాత రైలు ప్రయాణం చేసిన నన్ను సర్కార్ కోవిడ్ స్పెషల్ ఎక్ష్ప్రెస్స్ ఆహ్లాదభరిత కోవాలాయి సరస్సు పక్కన వున్నా చెంగల్పట్టు జంక్షన్ వద్ద దింపింది. బయటపడి, ఒక 'కాపీ' సేవించి, ఎదురుకుండానే వున్న బస్స్టేషన్ కి వెళ్లి, రోడ్డు మార్గాన్న కంచి ని బస్సులో చేరాను. తమిళం పూర్తిగా రాకపోయినా, అర్ధం చేసుకోగలను - పైగా, ఈ ప్రాంతం ఆంధ్ర సరిహద్దు కి దగ్గర, ఎంతో మంది తెలుగు వారి నిత్యం వచ్చి పోతూవుంటారు - కావున భాష సమస్యే కాదు. పల్లవుల అలనాటి రాజధాని అయిన కంచి పురాతన, ప్రసిద్ధ దేవాలయాలకు, సిల్క్ చీరలకు ప్రతీతి.  ప్రధాన బస్టేషన్ కూడా నగరం నడి  బొడ్డున వుంది.  కాంచిపురన్న వైష్ణవ దేవాలయాలన్నీ వున్నా ప్రాంతం విష్ణు కంచి గాను, శైవ దేవాలయాలన్నీ వున్నా ప్రాంతం శివ కంచి గాను పిలుస్తారు. ఇవే కాక,. ద్రావిడ సాంప్రదాయం లో కట్టిన జైన దేవాలయాలు కూడా నగరం అవతల కలవు. 1897 లో ఏర్పడిన కంచి పురపాలక సంఘం ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్.  ఒక చిన్నపాటి లాడ్జి రూము తీస్కుని (రెండవ శనివారం కావున ఎక్కువ సేపు పట్టింది), కాంచీపుర రాజా వీధులలో నిమ్మిత్తమాత్రుడనై పడ్డాను. 

 
Me at Karchapeswarar Temple


మొదటి రోజు (13/02/2021)
ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన  విషయం, ఇక్కడ అన్ని ప్రసిద్ధ దేవాలయాలు ఉదయం 06:00 గం నుండి నుండి మధ్యాన్నం 12:00 గం వరకు, తిరిగి మధ్యాన్నం 03:00 గం నుండి సాయంత్రం 06:00 గం (కొన్ని సుమారు రాత్రి 08:30 గం' వరకు) వరకు తెరిచి ఉంటాయి. లాడ్జి కి మూడు రూముల అవతలి వున్న చిత్రగుప్తాస్వామి గుడిని ముందర దర్శించాను. బహుశా చిత్రగుప్తునికి వున్న ఏకైక గుడి ఇదేనెమో! సప్త దీపాలు సమర్పించి, కలము, దస్త్రములు చేతబూనిన మూలవిరాట్ చుట్టూరా ఏడు  ప్రదక్షిణాలు చేసిన మంచిదని ఇక్కడి ప్రతీతి. చాలా పురాతనమైనదైనా, చిన్న గుడి. కాస్త ముందరే కార్చపీశ్వరుని గుడిని దర్శించాను. కూర్మావతార అయిన విష్ణుమూర్తి శివపూజ చేసినట్టుగా చెపుతారు. ఈ గుడి చాలా విశాలమైనది, కోనేరు కలదినూ, బయట మిట్ట మధ్యాన్నం ఎండ గా వున్నా కూడా, గుడి లోపల విశాలమైన ప్రాంగణం లో ఎత్తైన స్థంబాల మధ్య ఎంతో ఆహ్లాదంగా, చల్లగా అనిపించింది. తమిళనాట ద్రావిడ సాంప్రదాయన కట్టిన గుళ్ళు ఎంతో విశాలమైనవి! తర్వాత దగ్గరలోనే వున్నా కంచి కుడిల్ అనే ఒక ప్రయివేట్ మ్యూజియం ని సందర్శించాను. అక్కడి తో మొదటి రోజు మధ్యాన్నం సమయం సుమారు 12:30 అయింది. 

 

Chitragupta Swamy Temple

Kanchi Kamakshi Amman Temple

మధ్యాన్నం 03:00 గం' లకు షేర్ ఆటో మీద 108 వైష్ణవ దివ్యదేశాలన్నిటి లోకి సుప్రసిద్ధమైన వరదరాజ పెరుమాళ్ దేవాలయాన్ని (11వ శతాబ్దం) సందర్శించాను. 23 ఎకరాల విస్తీర్ణం కల్గిన ఈ దేవాలయం లోకి అడుగిడిన వెంటనే ఎడమ వైపు విజయనగర రాజులు కట్టించిన వంద స్థంబాల మండపం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆ శిల్ప కళా వైభవం వర్ణనాతీతం. మండపం పక్కనే వున్న కోనేరు లో యోగ నిద్ర లో వున్న మూల విరాట్ ని ప్రతి 40 ఏళ్ళకు ఒకసారి, 48 రోజుల పాటు ప్రధాన గుడి లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. లోపల ప్రధాన దేవాలయం లో కుడ్య చిత్రాలు చాలా వరకూ పాడైపోయాయి. వరదరాజ పెరుమాళ్ స్వామి గర్భ గుడి మొదటి అంతస్థు లో, పేరుందేవి తాయారు గుడి కొంచెం కింద ఎడమ వైపు కలవు. గర్భాలయం వెనకాలే ప్రసిద్ధ బల్లి శిల్పం గలదు - ఇది ఇప్పుడు ముట్టుకోలేము, కేవలం చూడడం మాత్రమే. తర్వాత మళ్ళీ బస్టేషన్ వైపు షేర్ ఆటో మీద వచ్చి, దగ్గర లోనే వున్న వామమూర్తి అవతారిఐన ఉలగానంద పెరుమాళ్ గుడిని దర్శించాను. అటుపైన, పద్మాసనం లో ప్రసన్నంగా విరాజిల్లిన కామాక్షి అమ్మవారి దర్శన భాగ్యం కల్గినిది. బాలాత్రిపుర సుందరి స్వరూపిణి అయిన కామాక్షి అమ్మావారు ఇక్కడి శివుని గూర్చి ఒక మామిడిచెట్టు కింద తపస్సు చేసారని ప్రతీతి. సాయంత్రం వేళ, రద్దీగా వున్నా కూడా, చక్కటి లైటెనింగ్ కాంతులలో కామాక్షి అమ్మవారి గుడి, కోనేరు, గాయత్రీ మండపం చూడడం ఒక చక్కని అనుభూతి. ఆ విధంగా మొదటి రోజు గడిచినిది.

Stone work at Hundred Pillared Hall
Varadaraja Perumal Temple

 

(To be continued...)

వెలువలి మహీత్
కాంచీపుర దర్శనం-1 (13 & 14వ తేదీలు, ఫిబ్రవరి 2021)
18/02/2021, - పాలకొల్లు.

Friday, April 24, 2020

జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం

"When Panchayat Raj is established, public opinion will do what violence can never do"
- Mahatma Gandhiji

పంచాయతీ రాజ్ దినోత్సవం గురించి...
భారతదేశ చరిత్ర గతిని  గమనిస్తే, స్వీయ ప్రతిపత్తి కల్గిన గ్రామ రాజ్యాల వ్యవస్థ అవగతమవుతుంది. ఉదా - గణతంత్ర వ్యవస్థ గా వర్ధిల్లిన వైశాలి రాజ్యం, చాలా ఉన్నతమైన చోళుల గ్రామీణ పరిపాలనా వ్యవస్థ. 1947 లో స్వాతంత్రం సాధించే నాటికి భారతదేశం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామీణ దేశం. భారత రాజ్యాంగం లో పొందుపరిచిన అధికరణ 40 పంచాయితీ రాజ్ వ్యవస్థ గురించి చాల క్లుప్తంగా ప్రస్తావించింది.  అయితే,ఇది కేవలం ఆదేశిక సూత్రం మాత్రమే. దురదృష్టపుశాత్తు,  వికేంద్రీకరణ దిశగా నిజమైన అడుగులు వేస్తూ,  పంచాయితీ రాజ్ వ్యవస్థ కి రాజ్యాంగ హోదా కల్పించడానికి దాదాపు అర్ధ శతాబ్దం పట్టింది. 

24 ఏప్రిల్ 1993 నుంచి అమలు లోకి వచ్చినటువంటి 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992)  పంచాయితీ రాజ్ వ్యవస్థ కి గౌరవప్రదమైన చట్టబద్ధత తో కూడిన రాజ్యాంగ హోదా కల్పించింది. ఈ  గొప్ప సందర్భాన్ని పురస్కరించుకుని, 2010 వ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 24 ఏప్రిల్ న జాతీయ పంచాయితీ
రాజ్ దినోత్సవం - National Panchayat Raj Day (NPRD)  గా నిర్ణయించింది. 2018 నాటికి భారతదేశ జనాభా లో స్థూలంగా 65.97% మంది, సుమారు 6,49,481 గ్రామాల లో (వీటిలో 2,50,000 గ్రామాల లో పంచాయతీ రాజ్ వ్యవస్థ కలదు) నివాసముంటున్నారు - దేనిని బట్టి పంచాయితీ రాజ్ వ్యవస్థ  ఆవశ్యకత తెలుస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ విషయం...
02 జూన్ 2014  తదనంతరం, తెలంగాణ రాష్ట్రం  విడిపోయిన తర్వాత, నవ్యంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గణాంకాలను పరిశీలిస్తే పెక్కు శాతం జనాభా గ్రామీణ ప్రాంతం లో నివాసం కలిగినవారు అని తెలుస్తుంది. పంచాయితీ రాజ్ వ్యవస్థ లో నూతనోత్తేజం  నింపుతూ,పారదర్శకత & జావాబుదారీతనం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్భవించింది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులైనటువంటి గ్రామ వాలంటీర్లు వెన్నెముక గా కల్గిన ఈ వ్యవస్థ, గ్రామా సచివాలయం ఒక Unit గా,  పంచాయతీ కార్యదర్శి Co-ordination తో, వివిధ Domain Experts at Village level (Engineering Assistant, Surveyor Assistant etc.,) గ్రామీణ వ్యవస్థ లో మమేకమయ్యేలా మహోద్యమాన్ని తలపెట్టింది. కొరోనా (Corona -Covid 19) దృష్ట్యా ఈ వ్యవస్థ ఎక్కువ Focus లోకి వచ్చింది & పలువురి ప్రశంసలు పొందింది. అయితే, ఈ వ్యవస్థ దేశకాల విపరీత పరిస్థితులను తట్టుకుని నిలబడుతుందా అన్నది ప్రశ్న. కానీ సద్విమర్శలను స్వీకరిస్తూ ఉన్నంత కాలం బహుశా ఏ లోటు వుండకపోవొచ్చు.

మీ అందరికీ జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు.       




వెలువలి మహీత్,
24/04/2020 - జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం,.
పాలకొల్లు.

Wednesday, February 5, 2020

కుమార భీమారామం

Temple Tank - Koneru

చారిత్రక ప్రాముఖ్యత దృష్ట్యా పంచా-రామ శైవ క్షేత్రాలన్నిటిలోకి పేరెన్నిక గాంచిన క్షేత్రాలు రెండు - ద్రాక్షారామం, సామర్లకోట. సామర్లకోట లో వున్న శివాలయం - కుమారా భీమారామం గా ప్రసిద్ధి. ఇక్కడ పార్వతి దేవి బాలా త్రిపురసుందరి గా వెలిశారు. ఈ గుడిని తూర్పు చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీముడు 9వ  శతాబ్దం లో నిర్మించినట్టు చెపుతారు (ఆయన  పాలనా కాలం - 892-921 CE).

An Inscription inside temple
Model of Temple

ఈ గుడి లో అనేక విశిష్టమైన విశేషాలు కలవు. గర్భాలయం రెండు భారీ ప్రకార గోడల లోపల వుంది. కోనేరు కుడా కలదు. ప్రధాన ద్వారం ద్వారా ప్రేవేశించిన వెంటనే ఎడమ వైపు కాలభైరవ స్వామి ఆలయం కలదు - ఈయన క్షేత్ర పాలకుడు. లోపల వున్నా రెండో ప్రాకార గోడ పై అనేక చిన్నపాటి  శిల్పాలు (సప్తమాత్రికలు, విలుకాడు etc), శాసనాలు వున్నాయి. రెండో ప్రాకార ద్వారం గుండా ప్రవేశించాక, ఒక భారీ నంది దర్శిస్తుంది. గర్భాలయం ముందు ప్రదక్షిణాపథం తో పాటు కొద్దిపాటి విశాలమైన స్థలం కలదు. ఇటీవల తవ్వకాలలో బయల్పడిన శిల్పాలు ప్రదక్షిణాపథం వద్ద చాల కన్పిస్తాయి - ఇందులో ఒకటి చాళుక్య సేనాపతి అయినా ఛన్దరాసి కి చెందినదిగా భావిస్తున్నారు. గర్భాలయం శిఖరం కి ఆనుకుని వున్నా గోడ పై దక్షిణం వైపు రెండు నాట్యకత్తెల శిల్పాలు వున్నాయి. ప్రధాన గర్భాలయం ద్వారం పై గజలక్ష్మి motif కలదు - ఇది తూర్పు చాళుక్యుల గుళ్ళ  లక్షణం. రెండు అంతస్తులు గా వున్న గర్భగుడి పై అంతస్థు లో పశ్చిమ దిక్కున ఒక స్థంభం పై లింగోద్భవ మూర్తి శిల్పం, దాని కింద కోలాటం చేస్తున్న స్త్రీల చిన్నపాటి శిల్పాలు చెక్కబడ్డాయి. తూర్ప చాళుక్యుల తదనంతరం రెడ్డి  రాజులు, ముసునూరి నాయకులు ఈ దేవాలయానికి అనేక మార్పూలు చేయదలచినా కుడా, ఈ గుడి పై తూర్పు చాళుక్యుల ప్రభావం మాత్రమే ఎక్కువ కన్పిస్తుంది. అందుకే, బహుశా ఇక్కడ గోపురాలు కుడా లేవు.

The Temple
Lingodhbhava Murthi - west pillar inside Garbha Griha

చరిత్ర కి, భక్తి కి సమప్రాధాన్యత కల్గిన ఇలాంటి గుడి కి వెళ్ళడం, దర్శించడం మనస్సుని  ఆహ్లాదపరిచింది.

Dancers Galore...
Mythology /స్థలపురాణం  - అసలు పంచారామాలు ఏమిటి ? (Warning - story based on faith/Hindu Mythology)
మార్కండేయ పురాణము  లో వున్న తారకాసుర వధ గాధ ఆధారంగా పంచారామ క్షేత్రాలు ఉద్భవించాయి. దేవతలకి, రాక్షసులకు జరిగిన సంగ్రామం లో దేవతల సేనాదక్షుడైన కార్తెకేయుడు తారకాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. అయితే, తారకాసురుని మృతి తో  అతని వద్ద ఎంతో తపస్సు తో పొందిన శివుని ఆత్మ లింగం ముక్కలై ఐదు భాగాలు గా భూమి పై రాలాయాని చెపుతారు. కాలక్రమేణా, ఆ ఐదు పూర్తి లింగాలు గా పునఃప్రతిష్టిచబడి, దేవాలయాలు గా వెలసాయన్నది ఒక వాదన. ఇట్టివి -
1. ద్రాక్షారామం (తూర్పు గోదావరి)
2. సామర్లకోట (తూర్పు గోదావరి)
3. పాలకొల్లు (పశ్చిమ గోదావరి)
4. భీమవరం - గుణుపూడి (పశ్చిమ గోదావరి)
5. అమరావతి (గుంటూరు)


With Supriya Madam, Srinivas Sir and friends - Harsha Garu &Janaki Ramachandra Garu



వెలువలి మహీత్,
05/02/2020 - Palakollu.