![]() |
బెంగళూరు HAL మ్యూజియం లో మిగ్-21 యుద్ధ విమాన రెప్లికా మోడల్ తో నేను (2016) |
(26 సెప్టెంబర్ 2025 న సుమారు అరవై రెండు వసంతాల తర్వాత భారత వాయుసేన, దేశానికి ఎనలేని సేవలందించిన మీకోయాన్-గురివిచ్ మిగ్-21 యుద్ధ విమానానికి సగౌరవంగా వీడ్కోలు పలకనున్న సందర్భాన్ని పురస్కరించుకుని.....
మిగ్ స్వగతం i.e, మిగ్-21 యుద్ధ విమాన మాటల్లో........ )
విశ్రాంతి కై శాశ్వత విరామాన్ని అనుభవించబోయే సమయం లో, మోగే చప్పట్ల మోత కన్నా, వెకిలి నవ్వులే పెద్దగా వినిపిస్తున్నాయేమిటి ? నాలుగు హాలీవుడ్ సినిమాలు చూసేసి, నాలుగు రోజులు కరెంటు అఫైర్స్ చదివేసి, F-16 తో పోల్చి నన్ను తక్కువ చేస్తూ చిన్నబుచ్చుకునే వారికి నేను చెప్పే సమాధానం - తిక్కన గారి భారతం లో రారాజుని చూసి అర్జునుడన్నట్లు "ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలదె."
ఎక్కడో రష్యాలో పుట్టిన తుప్పట్టిన విమానాన్ని (యంత్రాన్ని), నేను తెలుగు తిక్కన గారి పద్యం చెప్పడం ఏమిటి ? అంతా A.I. మహిమే.
ఇంకా మొదలయ్యి, అవ్వని ప్రచ్ఛన్న యుద్ధం సాక్షిగా, వెండి వెన్నెల ముద్దల లాంటి యూరాల్ పర్వత శ్రేణుల నడుమ, 1950 ల లో ఒక ప్రేమికుల దినోత్సవం నాడు నేను ఉద్భవించాను. 1962 లో ఒక నమ్మకం పటాపంచలయ్యింది భారతావనికి. అగ్రరాజ్యాల అలజడులు మధ్య, పొరుగింటి పోట్లాటల తో దేశ ఉనికికే ఎసరు అయిన రోజులు, అదిగో అప్పుడే సరిగ్గా 1963 లో మొట్టమొదటి సారిగా, నా మెట్టినింట అడుగుపెట్టాను. విచిత్రమేమిటంటే, ఇదే సోవియెట్ రష్యా మొట్టమొదటి సారిగా ఒక పొరుగు దేశానికి మిగ్ విమానాన్ని, తదనుగుణ సాంకేతికతను బదిలీ చేయడం.
ఉత్తర ధృవానికి బాగా వంటబట్టే యాంత్రికతని కలిగిన నాకు, ఇక్కడికి వచ్చాక, ఇక్కడి పరిస్థితులకు ఇమిడే మార్పులు చేశారు. చండీగఢ్ చేరి, సేద తీరేలోపు, మొదటి పుష్కరమే ఎన్నో పరీక్షలు. అన్నింటా జయకేతమే! 1965, 1971 లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కలకత్తా గగన వీధుల నుండి, కార్గిల్ పర్వత శ్రేణి వరకు, నాది ఒక 'అభినందనీయ' పయనమే. అయిదు పుష్కరాల పాటు దక్షిణ ఆసియా లో తిరులేని యుద్ధ విమానం, ఒక సింహస్వప్నం! నాకు షష్టి పూర్తి అయ్యేసరికి, ఒక 870 మిగ్-21 లను వాయుసేన ఉపయోగించింది, అందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వారు సుమారు 600 మిగ్-21 లను తయారు చేశారు .
కానీ, కాలం మారింది. పుట్టినిల్లు విచ్చిన్నమయ్యింది, గోర్బచెవ్ గారి ప్రయత్నం విఫలం అయ్యింది. 'ఎగిరే శవపేటికలు' అని మెట్టినిల్లు మొట్టికాయలు వేసింది. 'విమానాన్ని (యంత్రాన్ని) కదా, నాకు ఏమి హావభావాలు లేవు. అందరు కొత్త ని కోరుకుంటున్నారు. కానీ 'వేయిపడగలు' లో విశ్వనాథ సత్యనారాయణ గారన్నట్టు, "నూత్నత్వము నూత్నత్వమే కానీ శక్తి ఎలా అవుతుంది?"
అయిదు పుష్కరాల లో ఎంతో జరిగింది. ఇప్పుడు 'తేజస్' లాంటి దేశీయ వారసులొచ్చారు. వివిధ సాంకేతిక సమస్యల వల్ల అమరులైన ఎంతో మంది ధీరులను తలుచుకుని మనస్సు చివుక్కుమంది. 'ఎగిరే శవపేటిక' అనే అపవాదు ఇంక ఎప్పటికి పోదు ఏమో నాకు. అయినా, విమానాన్ని (యంత్రాన్ని) కదా, నాకేమి ఉంటాయి లే హావభావాలు.
సమయమాసన్నమయ్యింది. అదిగో, భాస్కరుడు ఉదయించబోతున్నాడు. ఇదే ఇక చివరి వీడ్కోలు. చరిత్ర పుటల్ని తిరిగి ఏదో ఒక రోజు తీరిగ్గా తిరగేసినప్పుడు, కాస్త నా గురించి కొంతైన మంచి గా తలుచుకోండి. జై హింద్.
మిగ్ స్వగతం
Maheeth Veluvali,
16 Saladi Jamindar Street, Palakollu,.
16 Saladi Jamindar Street, Palakollu,.
25th of September, 2025.