My travels is all about... My views, thoughts and experiences on/about/at/with random places of interest, persons, things, events, issues etc,. I am an eternal student with a restless mind and a tumultuous heart!
My travels is all about... My views, thoughts and experiences on/about/at/with random places of interest, persons, things, events, issues etc,. I am an eternal student with a restless mind and a tumultuous heart!
Friday, February 27, 2026
Tuesday, February 17, 2026
మిస్సైన ట్రైన్....మిస్సవ్వని లింగరాజ స్వామి దర్శనం
సాయంత్రం 5.45 అవ్తోంది. పూరి బడా దందా (గ్రాండ్ రోడ్) లో రోడ్డు మీద వున్న చిన్న చిన్న షాపులను చుస్తూ Twills దగ్గర ఆగి రాపిడో బైక్ బుక్ చేసుకున్నా రైల్వే స్టేషన్ వరకు. జగన్నాధ స్వామి దర్శనం బాగా జరిగింది. చాలా కాన్ఫిడెంట్ గా పూరి – తిరుపతి ఎక్ష్ప్రెస్స్ 6.40 కి అని ధీమా గా, ట్రైన్ లో తినడానికి దొరుకుతాయి, కానీ, దగ్గర్లో వున్న ఒక వెజిటేరియన్ హోటల్లో వెజ్ బిర్యాని ప్యాక్ చేయించి, పూరి స్టేషన్ బయట అటూ ఇటూ పచార్లు చేశాను. మంచి క్షేత్రము, పైగా పుట్టిన రాష్ట్రం కదా, వదల బుద్ధి అవ్వట్లేదు. అదిగో అప్పుడే కనిపించింది, రోడ్డు మీద ఒక కొట్టు...
చానా పోడ, రసగుల్లా, రసమల్లై, చానా గజా స్వీట్ల కొట్టు. జనం ఎగబడి కొంటున్నారు. సరే, టైం వుంది కదా అని తీరికగా చుస్తూ, ఒక పావు కేజీ చానా పోడ ప్యాక్ చేయిచాను ట్రైన లో స్వాహా చేద్దాం అని. 6.20 అవ్తోంది. దగ్గర లోనే పూరి స్టేషన్ కన్పిస్తోంది. కాస్త పక్క గా వెళితే ఒక చిన్న ఖిల్లీ బడ్డి కనిపించింది. ఎలాగో వచ్చాం కదా, ఇంకా జస్ట్ 20 నిమషాల్లో ఒక 5 నిమషాల్లో స్టేషన్ కి వెళ్ళిపోవచ్చని ధీమా గా ఒక వాటర్ బాటిల్, ఒక మీథా పాన్ (ఖిల్లీ) కట్టించా. పక్కన ఎవరో హిందీ లో Where is my Train app చుస్తూ కంగారు పడుతున్నారు. ‘ఆప్ భీ పూరి తిరుపతి పకడ్నా హైన్ క్యా’ అని మాట కలిపాను. నా మాట విని అప్పటి వరకు సైలెంట్ గా వున్న ఖిల్లీ బడ్డి ఆయన చక్కని శ్రీకాకుళం యాస లో ‘ఏటి బాబు? మీరు పూరి టిరుపతి కా? మరేటి, ముందే చెప్పొచ్చుగా, అది ఎప్పుడో ఎల్లిపొంది అనుకుంటా’ అని అన్నారు. కంగారు గా నేను అప్పుడు Where is my Train app ఓపెన్ చేసి చూసా, ట్రైన్ కరెక్ట్ టైం పూరి లో సాయంత్రం 6.30. నాకు ఖుర్దా రోడ్ జంక్షన్ నుంచి బుక్ అయ్యింది టికెట్, ఈ ట్రైన్ తదుపరి స్టాప్ అయిన ఖుర్దా రోడ్ జంక్షన్ నుంచి 7.40 కి బయల్దేరుతుంది. పూరి నుంచి ఖుర్దా కి unreserved ticket తీసుకున్నా, 7.40 అనే టైం మాత్రమే రిజిస్టర్ అయ్యింది బుర్రకి, ఆ దెబ్బ తో పూరి లో 6.40 కి బయల్దేరుతుంది అనుకున్నా, అవివేకంగా!
![]() |
| అదిగో అప్పుడే కనిపించింది, రోడ్డు మీద ఒక కొట్టు... |
చేసేదేమీ లేక, గబా గబా ప్లాట్ఫారం మీదకి పరిగెట్టా, పూరి తిరుపతి ఊసే లేదు. సమయం 6.41. చావు కబురు చల్లగా అన్నట్టు 6.39 కి బయల్దేరింది ట పూరి నుంచి ఆ ట్రైన్. ప్రయాణాలలో ఎప్పుడూ జాగ్రత్త గా వుండే నాకు ఒక ఎదురుదెబ్బ. ఇంత లాంగ్ ట్రైన్ ఎప్పుడూ మిస్ చెయ్యలేదు. తర్వాత రోజు ఉదయమే వెళ్ళాలి ఆఫీసు కి. ఎక్కువ శెలవులు పెట్టలేను కొన్ని పరిస్థితుల దృష్ట్య. స్టేషన్ బయటకి వచ్చి చూసా. రోడ్ మీద వెళితే ఖుర్దా 59 కి.మీ లు. సుమారు 50 నిమిషాలలో వెళ్ళాలి ఇదే ట్రైన్ క్యాచ్ చెయ్యాలి అంటే. పూరి నుంచి నెక్స్ట్ ట్రైన్ వెంటనే లేదు. ఆటో వాళ్ళ తో మాట్లాడి చూశా, ఏమి అర్ధం అవ్వలేదు.
అప్పుడే స్టేషన్ బయట ఒక కారు బుక్ చేస్కున్న మధ్య వయస్సు దంపతులు భద్రక్ వెళ్ళడానికి సిద్ధంగా వున్నారు, ఆ బండి అతనికి నా పరిస్థితి వివరించి, ఖుర్దా లో దిగబెట్టమన్నాను. అది దారి కాదు, కాస్త deviate అవ్వాలి వారి రూట్ కి. గట్టిగానే అడిగారు, బేరం కుదిరింది. మార్గ మధ్యలో టెన్షన్ పడుతూనే వున్నాను, ఖుర్దా లో ట్రైన్ అందుతుందా లేదా అని. ఇంట్లో మమ్మీ, డాడి కి, విజయవాడ లో మా శ్రీమతి కి ఫోన్ చేసి చెప్పాను పరిస్థితి, కంగారు పడొద్దని, ఎలాగోలా ట్రైన్ క్యాచ్ చేస్తానని, అది మిస్ అయతే, తర్వాత ట్రైన్ కి అయినా వచ్చేస్తానని. Traffic భయంకరంగా వుంది. దానికి తోడు, భద్రక్ వారు పూరి శివార్లలో కాసేపు కారాపి, కాజాలు కొన్నారు. అప్పుడే నాకు జ్ఞానోదయమయింది. ఖుర్దా లో ఈ ట్రైన్ మిస్ అవతానని అర్ధమయ్యింది. ప్రతీ సారి పూరి జగన్నాథుని దర్శిన్చుకున్నప్పుడు భువనేశ్వర్ లింగరాజ స్వామిని కుడా దర్శించుకోవడం అలవాటు. ఈ సారి కుదరలేదు, ప్లాన్ చెయ్యలేదు, అది ఒక వెలితి లా అనిపించింది. సర్లే, ఎలాగో ట్రైన్ మిస్ అవ్తాను, ఇంక బాధ ఎందుకు, ఒక సారి దర్శించుకుందాం అని నిర్ణయించుకున్నాను. పర్సు తేలికపడబోతోంది. మనస్సు కూడా తేలికపడింది.
![]() |
| లింగారాజ శివాలయం సింహద్వారం వద్ద |
భువనేశ్వర్ భారుండా సెంటర్ లో ఆగేసరికి రాత్రి 9.00 దాటింది. ఒక ఆటో ని మాట్లాడుకుని లింగరాజ మందిరం వైపు పరుగులు పెట్టాం. గుడి తెరిచి వుంటుందో లేదో తెలీదు ఆ సమయంలో. రెండు చోట్ల రోడ్ బ్లాకు! చిరాకు వస్తోంది. చివరకి గుడి దగ్గరకి వచ్చేసరికి 9.35 కావొస్తోంది. పక్కనే ఆటో పార్క్ చేసి, ఆటో ఆయన పరుగు పరుగున సింహ ద్వారం వైపు వెళ్లారు, నా కోసం గుడి తెరిచి వుందో లేదో చూడడానికి. ఆశ్చర్యం గా తెరిచి వుంది. లగేజి ఆటో లో వుంచేసి, మొబైల్ / చెప్పుల కౌంటర్ మూసేసిన కారణంగా, అక్కడ డ్యూటీ లో వున్న పోలీసులను రిక్వెస్ట్ చేసి, వారి వద్ద మొబైల్ పెట్టి, పరుగు పరుగున లోపలకి వెళ్లాను.
![]() |
| లింగరాజ మందిరం (Lateral View) |
తిరిగి ఆటో ఎక్కి, భువనేశ్వర్ స్టేషన్ చేరేసరికి 10.00 అవ్తోంది. 10.11 కల్లా సంత్రగాచ్చి – తిరుపతి సుపర్ఫాస్ట్ వచ్చింది. ఈ లోపు ఆన్లైన్ లో టికెట్ తీసేసా, ఎదురుకుండా ఆగిన బోగి లో ఎక్కేసా. ఒక సైడ్ లోయర్ లో సెటిల్ అయ్యి, టి.టి. గారి కోసం వెయిట్ మొదలెట్టాను. ఈ లోగా, ఆకలి గుర్తుకి వచ్చింది. సంచి లో కాస్త ముద్ద అయిన చానా పోడ సేవించాను.
![]() |
| పూరి శ్రీ క్షేత్రం / జగన్నాథ మందిరం వద్ద |
కొసమెరుపు – నేను మిస్సైన పూరి తిరుపతి తర్వాతి రోజు రాజమహేంద్రవరానికి ఉదయం 9.15 కి చేరింది. నేను తర్వాత ఎక్కిన సంత్రగాచ్చి – తిరుపతి సుపర్ఫాస్ట్ దానికన్నా తొందరగా 8.52 కే దిమ్పేసింది నన్ను రాజమహేంద్రవరం లో....
మిస్సైన ట్రైన్....మిస్సవ్వని లింగరాజ దర్శనం (Telugu Story)
16 Saladi Jamindar Street, Palakollu,.


.jpeg)
.jpeg)


.jpeg)


