(Tribute to PV Narasimha Rao on his birth centenary)
డిసెంబర్ 2004
ఇంక నా జీవితం ముగుస్తోంది. వచ్చిపోయే వారిని గుర్తుపట్టడం కష్టం గా వుంది. పెరిగిపోయిన కోర్టు కేసుల్ని ఎదుర్కోవడానికి అప్పోయింట్ చేసిన మా ప్లీడర్ గారు ధరించిన నల్లని కోటు లో నలుపు మాదిరి ఒక కారు చీకటి ఎప్పుడూ కమ్మేస్తోంది నా ఆలోచనల్ని. కేసులు అంటే గుర్తుకి వచ్చింది. ఇంకా ఎన్ని కేసులు మిగిలాయి? అవి నేను గెల్చానా? ఓడిపోయానా? గుర్తుకి రావట్లేదు. ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి. అసలు ఏది ఆరంభం? ఏది అంతం!
ఎక్కడ మొదలైంది ఈ ప్రయాణం? ఎన్ని మజిలీలు? త్రిపురీ సభ లో పండిట్ నెహ్రు గారి ప్రసంగం విని నైజం ప్రభుత్వం పై కదం తొక్కింది నేనే నా? అది త్రిపురీ సభా? హరిపూరీ సభా? గుర్తుకి రావట్లేదు. హై కమాండ్ ఉద్దేశాన్ని పూర్తిగా తెలుసుకోలేక, భూ సంస్కరణలు ప్రవేశపెట్టి, పదవి కోల్పోతే, ఆహా, ఒక ముళ్ళ కిరీటం తల మీంచి తీసినట్టు అయింది. అది 1971 ఆ ? 1973 ఆ ? గుర్తు లేదు....
భాషలు నేర్చుకునేకొద్దీ మౌనం లో వున్న మాధుర్యాన్ని, నియంతృత్వ పోకడలు కల్గిన నాయకుల తో మెలిగిన కొద్దీ consensus decision making లో వుండే అందాన్ని, inevitability ని సుకుమారంగా గ్రహించాను. నూతనోత్తేజం నిండింది 80 వ దశకపు భారతావని లో, నా సన్యాసానికి ఇంకా మార్గం సుగమమైంది. కానీ విధి విచిత్రం. నవ్వినా నాప చేనే పండింది. ఏమి తెలుసు నాకు ఆర్ధిక వ్యవస్థ గురించి - ఆర్ధిక శాస్త్రాన్ని ఎప్పుడూ లెక్కకట్టలేదు. లెక్కకట్టాల్సిన అవసరం వచ్చింది. పది మంది సభ్యుల మద్దతు లేక ఎప్పుడు పడిపోతుందో తెలీని నా హయం లో సంస్కరణలు అసలు ఎలా జరిగాయి? అది ఒక అబ్భుతమా? అందున, నా పాత్ర నామమాత్రమేనా? రాజ్యంగ నిర్మాత డా.అంబెడ్కర్ గారు అభివర్ణించినట్టు, మన దేశం నిజం గా ఒక Indestructible Union యేనేమో. తూర్పు వైపు చూడమని, అగ్రరాజ్యాల వాంఛలకు తలొగ్గకుండా, పొరిగింటి వారికి పాఠాలు చెప్తున్నప్పుడు ఎంతో హాయిగా అనిపించింది. ఢిల్లీ రాజా వీధుల లో పంజాబ్ కార్యకర్తలు 'పీవీ నరసింహ రావు కి జై' అని జై జైలు పలుకుతువుంటే, వేరెవరైనా పులకరించిపోయేవారే - కానీ అట్టి పొగడ్తలు, భౌతిక శుఖాలు నా లో అంతర్మథనాన్ని ఆపలేకపోయాయి.
అది 1996 ఆ ? 1998 ఆ ? గుర్తు లేదు - టికెట్టు కేటాయించలేదు నాకు. రోజులు మారాయి. మనుషులు వస్తారు, పోతారు,వ్యవస్థే శాశ్వతం! నమ్మిన వారు నట్టేట ముంచారు. ఇంకెంతకాలమో జీవితమనే ఈ వ్యధ . నా పాత్ర ముగిసింది. కానీ నా లో ఇంకా ఆ అంతర్మథనం ఆగలేదు!