Monday, March 16, 2026

ఓ చింత చెట్టు కథ



(
సంక్రాంతి, జనవరి 2026; గ్వాలియర్, మధ్య ప్రదేశ్)  

జిబ్రాల్టర్ అఫ్ ఇండియా గా పేరుగడించిన, శత్రుదుర్భేద్యమైనగ్వాలియర్ కోట సందర్శన పూర్తి అయ్యింది. దగ్గర్లో వున్న తెలీ కా మందిర్, సాస్ బహూ గుళ్ళ దర్శనమూ అయ్యింది. తదుపరి మజిలీ హిందుస్తానీ సంగీత సామ్రాట్ తాన్సేన్  గారి సమాధి. 2023 లో గ్వాలియర్ నగరానికి UNSECO World Heritage City of Music గా గుర్తింపు వచ్చింది. హిందుస్తానీ సంగీత సంప్రదాయం లో గ్వాలియర్ ఘరానా (గురు శిష్య పరంపర) చాలా సుప్రసిద్ధమైనది, పురాతనమైనది. ఈ ఘరానా / గురు శిష్య పరంపర కి ఆద్యుడు రాజ రామ తనూ పాన్డే అలియాస్ తాన్సేన్. గ్వాలియర్ నగరవాసి.



సాస్ బహు గుడి దగ్గర నుంచి ర్యాపిడో  బుక్ చేశాను. క్యాప్టెన్ పేరు దీపక్ యాదవ్ గారు. ఏదో బిజినెస్ మెన్ అని చెప్పారు. సాస్ బహు గుడి దగ్గర నుంచి ర్యాపిడో బైకు మీద తాన్ సేన్ సమాధి వైపు కదిలాను. ర్యాపిడో బైక్ గంభీరమైన గ్వాలియర్ వీడి మాధవరావు సింధియా గారి విగ్రహం దాటి, వన్ టౌన్ ఏరియా, మార్కెట్ మీద గా చేరాల్సిన చోట కి చేరాం. తాన్సేన్ గారి సమాధి పక్కనే మహ్మద్ గౌస్ అనే సుఫీ ప్రవక్త సమాధి వుంది, అది చాలా పెద్దది. సమాధి వైపు వెళ్తూనే మెట్ల మీద వున్న ఒకాయన ఉపోద్ఘాతం అందుకున్నారు, తెలిసి తెలియని విశేషాలు చెప్తూ తాన్సేన్ గురించి. లోగా నా తో పాటు వచ్చిన యాదవ్ గారు సమాధి వైపు వెళ్లి సాష్టాన్గపడ్డారు. అక్కడే ఆవరణ లో కంచె వేసిన చింత చెట్టు ఒకటి కనిపించింది. 

అతి కష్టం మీద యాదవ్ గారు ఇంకొకాయన ఆ చింత చెట్టు దగ్గర చాల సాహాసం తో నాలుగు ఆకులు కోసి, అత్యంత వినమ్రంగా నమిలారు.  నేను కుతూహలం గా చెట్టు గురించి వాకబు చేశాను. అది మంచి మహిమ కలిగిన చింత చెట్టు అని, దానికి చింత కాయలు ఏమీ కాయవని, దాని ఆకులు నమిలితే తాన్సేన్ మాదిరి గాత్ర మాధుర్యం కలుగుతుందని నమ్మకం ట. అది అక్కడి ఆచారం ట. సమాధి కి వచ్చి పోయే సందర్శకులు, ముఖ్యంగా ఏటా జరిగే తాన్సేన్ ఉత్సవం అప్పుడు అరి వీర భయంకరాకారం గా చెట్టు బెరళ్ళు ఊడబీకేవారని, చెట్టు ఇంక ఉంటుందో లేదో అన్న దీనస్థితి కి చేరుకున్న కారణంగా దానికి ఒక కంచే వేసి రక్షించారని తెలియవచ్చింది. భలే ముచ్చట వేసింది.


మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా మన్ననలు పొందిన నవరత్నాల లో ఒకరైన తాన్సేన్ గారు బహుసా ఇక్కడే నడుస్తూ ఏదో ఒక రోజు ఈ చెట్టు ఆకులు నమిలి వుండవచ్చు. జనం అది చూసి మానవ ప్రయత్నం తో సాధించిన excellence ని జీర్ణించుకోలేక సంగీత పాండిత్యాన్ని చింత చెట్టు కి అపాదిన్చారేమో.  లేక, నిజంగా తాన్సేన్ గారి ప్రతి చర్యని గౌరవంగా అనుకరించాలనే ఉత్సాహం ఏమో, అది కాక పొతే నిజంగా చింత చెట్టు ఆకులకి మహత్తు వుందేమో. 

నన్ను కుడా నమలమన్నారు. సరే, ఇంక ఇప్పుడు వచ్చే గాత్ర మాధుర్యం తో నేను తాన్సేన్ లాగా రాగ మల్హర్, రాగ దీపక్ లు పాడినా, పోషించే అక్బర్ పాదుషాలు లేరు గా. దీనం గా చూస్తున్న ఆ చింత చెట్టు వైపు మరీ పుష్పవిలాపం టైపు లో ఫీల్ అవ్వకపోయినా, ఆకులు నమిలే ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాను.  





ఓ చింత చెట్టు కథ  (Telugu Story)

Maheeth Veluvali,
16 Saladi Jamindar Street, Palakollu,.

16th of March, 2026. 


4 comments:

  1. ఆ చింత చెట్టు దర్శనంవల్ల నే కాంతా....అంటూచంటిదాని దగ్గర చక్కగాపాడావు.👏👏👌👌👍👍

    ReplyDelete